అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘హరిహర వీరమల్లు’ పారితోషికాన్ని తిరిగి ఇచ్చారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ చిత్రం కోసం పవన్ తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
2020లో అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా, సుదీర్ఘ కాలం సెట్స్‌పైనే ఉండిపోయింది. క్రిష్ దర్శకత్వంలో చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్‌కల్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పటి నుంచి ప్రజా సేవకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. అలా మరికొన్ని నెలల పాటు షూటింగ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవలే ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
ఇన్నేళ్ల పాటు సినిమా సెట్స్‌పైనే ఉండటం, నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థికంగా అదనపు భారం పడింది. ఈ విషయాలను తెలుసుకున్న పవన్‌కల్యాణ్ తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. నిర్మాతల గురించి ఆలోచించే నటుల్లో పవన్ కల్యాణ్ ముందుంటారని మరోసారి నిరూపించారు.