ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ టీజర్ టైమ్‌ను చిత్ర బృందం వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న తరుణం రాబోతోంది. ఆయన కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న మూవీ అప్డేట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ టీజర్ అప్డేట్ను ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. జూన్ 16న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇప్పుడు సమయాన్ని కూడా ప్రకటించింది. జూన్ 16, ఉదయం 10.52గంటలకు (The Raja Saab Teaser Release Date Time) టీజర్‌ను విడుదల చేయనున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ప్రభాస్ సరికొత్త అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. (The Raja Saab Release date).
ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి దృష్టి ‘ది రాజాసాబ్’ పైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, సంజయ్‌దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి.