ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్
క్వాలిఫయర్ 2లో ముంబయిపై విజయం
శ్రేయస్ అద్భుత ఇన్నింగ్స్
అహ్మదాబాద్
పంజాబ్ అదరగొట్టింది. రెండో అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఐపీఎల్ 18 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్‌లో పరాభవం మిగిల్చిన నిరాశ నుంచి కోలుకుంటూ పంజాబ్.. క్వాలిఫయర్ 2లో అయిదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌పై అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదిరే బ్యాటింగ్‌తో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జట్టు ఇంతకుముందు ఒకే ఒక్కసారి.. 2014లో ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్లో బెంగళూరును పంజాబ్ కింగ్స్ ఢీకొంటుంది. ఐపీఎల్లో ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడనున్నాం.
పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్; 41 బంతుల్లో 5×4, 8×6) చెలరేగిన వేళ ఆ జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం క్వాలిఫయర్ 2లో 5 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను మట్టికరిపించింది. మొదట ముంబయి 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. తిలక్ వర్మ (44; 29 బంతుల్లో 2×4, 2×6), సూర్యకుమార్ యాదవ్ (44; 26 బంతుల్లో 4×4, 3×6), బెయిర్‌స్టో (38; 24 బంతుల్లో 3×4, 2×6), నమన్ ధీర్ (37; 18 బంతుల్లో 7×4) సత్తా చాటారు. శ్రేయస్ అద్వితీయ పోరాటానికి నేహాల్ వధేరా (48; 29 బంతుల్లో 4×4, 2×6) సహకారం తోడు కావడంతో లక్ష్యాన్ని పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్ ఆరంభం రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. ఓవర్లలో ఎలాంటి కోత పెట్టలేదు.
శ్రేయస్ పోరాటం: ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (6) త్వరగానే నిష్క్రమించినా ఛేదన ఆరభంలో పంజాబ్ విశ్వాసంతోనే సాగింది. ఇంగ్లిస్ (38; 21 బంతుల్లో 5×4, 2×6) చక్కని షాట్లతో అలరించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. ప్రియాంశ్ ఆర్య (20) కూడా బ్యాట్ ఝళిపించాడు. కానీ ఇన్నింగ్స్ జోరుగా సాగుతున్న దశలో అశ్వని బౌలింగ్‌లో అతడు వెనుదిరిగాడు. ఆరో ఓవర్లో అతడు నిష్కమించేటప్పటికి పంజాబ్ స్కోరు 55. ఎనిమిదో ఓవర్లో ఇంగ్లిస్ కూడా ఔటైనా.. శ్రేయస్, నేహాల్ వధేరా చక్కని బ్యాటింగ్‌తో పంజాబ్‌ను రేసులో నిలిపారు. ధాటైన బ్యాటింగ్‌తో సాధించాల్సిన రన్‌రేట్‌ను అదుపులో ఉంచారు. హార్దిక్ బౌలింగ్‌లో వధేరా సిక్స్, ఫోర్ బాదగా.. టాప్లీ ఓవర్లో శ్రేయస్ వరుసగా మూడు సిక్స్‌లు దంచేశాడు. 15 ఓవర్లకు 147/3తో పంజాబ్ గెలుపు పై కన్నేసింది. తర్వాతి ఓవర్లో వధేరా ఔటైనా, 17వ ఓవర్లో శశాంక్ రనౌటైనా శ్రేయస్ అదిరే బ్యాటింగ్‌ను కొనసాగించడంతో పంజాబ్ లక్ష్యం దిశగా సాగింది. 18వ ఓవర్లో బుమ్రా సూపర్ యార్కర్‌ను శ్రేయస్.. బౌండరీకి తరలించిన తీరు అద్భుతం. ఆఖరి రెండు ఓవర్లలో పంజాబ్‌కు 23 పరుగులు అవసరమయ్యాయి. కానీ కళ్లు చెదిరే బ్యాటింగ్‌ను కొనసాగించిన శ్రేయస్.. ఆరు బంతుల్లోనే పని పూర్తి చేశాడు. అశ్వని వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నాలుగు సిక్స్‌లతో పంజాబ్‌ను విజయ తీరాలకు చేర్చాడు.
ముంబయి ధనాధన్: వర్ష వాతావరణంలో అంతకుముందు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబయి ఓపెనర్ బెయిర్‌స్టో మరోసారి అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన అతడు.. ఆ జట్టుకు బలమైన పునాది వేశాడు. అయితే గత మ్యాచ్‌లో చెలరేగిపోయిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ (8) మాత్రం ఈసారి త్వరగానే ఔటయ్యాడు. రోహిత్ నిష్క్రమణ బెయిర్‌స్టోపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అతడు ఎటాకింగ్ గేమ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబయి 65/1తో నిలిచింది. అయితే ఏడో ఓవర్లో ప్రమాదకర బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా పంజాబ్‌కు వైశాఖ్ ఊరటనిచ్చాడు. కానీ తిలక్ వర్మ చక్కని షాట్లతో వైశాఖ్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్.. చాహల్ ఓవర్లో సూర్యకుమార్ సిక్స్, ఫోర్ బాదడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ముంబయి 102/2తో బలమైన స్థితిలో నిలిచింది. బ్యాటర్ల మెరుపులు కొనసాగడంతో 14వ ఓవర్లో 142/2తో ముంబయి భారీ స్కోరుపై కన్నేసింది. కానీ పరిస్థితి ప్రమాదకరంగా మారిన దశలో అదే స్కోరు వద్ద జోరుమీదున్న ఆటగాళ్లిద్దరినీ ఔట్ చేసి ఊపిరిపీల్చుకుంది పంజాబ్. సూర్యను చాహల్, తిలక్‌ను జేమీసన్ వెనక్కి పంపారు. సూర్య, తిలక్ జంట మూడో వికెట్‌కు 42 బంతుల్లోనే 72 పరుగులు జోడించింది. అయితే నమన్ ధీర్ చెలరేగడంతో ఆఖరి అయిదు ఓవర్లలో ముంబయి 57 పరుగులు రాబట్టగలిగింది.
ముంబయి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) వైశాఖ్ (బి) స్టాయినిస్ 8; బెయిర్‌స్టో (సి) ఇంగ్లిస్ (బి) వైశాఖ్ 38; తిలక్ వర్మ (సి) ప్రియాంశ్ (బి) జేమీసన్ 44; సూర్యకుమార్ యాదవ్ (సి) వధేరా (బి) చాహల్ 44; హార్దిక్ పాండ్య (సి) ఇంగ్లిస్ (బి) అజ్మతుల్లా 15; నమన్ ధీర్ (సి) స్టాయినిస్ (బి) అజ్మతుల్లా 37; రాజ్ బవా నాటౌట్ 8; మిచెల్ శాంట్నర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 203;
వికెట్ల పతనం: 1-19, 2-70, 3-142, 4-142, 5-180, 6-197;
బౌలింగ్: అర్ష్‌దీప్ సింగ్ 4-0-44-0; జేమీసన్ 4-0-30-1; స్టాయినిస్ 1-0-14-1; అజ్మతుల్లా 4-0-43-2; వైశాఖ్ 3-0-30-1; చాహల్ 4-0-39-1
పంజాబ్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ (సి) హార్దిక్ (బి) అశ్వనికుమార్ 20; ప్రభ్‌సిమ్రన్ (సి) టాప్లీ (బి) బౌల్ట్ 6; ఇంగ్లిస్ (సి) బెయిర్‌స్టో (బి) హార్దిక్ 38; శ్రేయస్ నాటౌట్ 87; వధేరా (సి) శాంట్నర్ (బి) అశ్వనికుమార్ 48; శశాంక్ రనౌట్ 2; స్టాయినిస్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 4;
మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 207;
వికెట్ల పతనం: 1-13, 2-55, 3-72, 4-156, 5-169;
బౌలింగ్: బౌల్ట్ 4-0-38-1; టాప్లీ 3-0-40-0; బుమ్రా 4-0-40-0; అశ్వని కుమార్ 4-0-55-2; శాంట్నర్ 2-0-15-0; హార్దిక్ 2-0-19-1