Press "Enter" to skip to content

Pashmailaram Blast: పాశమైలారం పేలుడు ఘటన.. 42 మంది మృతి

సంగారెడ్డి: పటాన్‌‌చెరులోని పాశమైలారంలో పెనువిషాదం చోటుచేసుకుంది. నిన్న(సోమవారం) సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో (Pashmailaram Blast) 42 మంది కార్మికులు మృతిచెందారు. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు, క్షతగాత్రులు బీహార్‌, ఒడిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. అయితే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలను అధికారులు తొలగిస్తున్నారు. శిథిలాల కింద మరో 20 మంది ఉన్నారని, 33 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో మరికొన్ని మృతదేహాలు ఉన్నాయి. తెలంగాణ చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్, హెడ్రా, రెవెన్యూ, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

కలెక్టర్ ప్రావీణ్య ఏం చెప్పారంటే..

పాశమైలారం ఘోర ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి, జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీసు బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 57 మంది కార్మికులు పూర్తి సురక్షితంగా ఇంటికి వెళ్లారని వెల్లడించారు. ప్రస్తుతం 35 మంది కార్మికులకు పలు ఆస్పత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారని.. వీరికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. 47 మంది కార్మికులు గల్లంతయ్యారని.. ఇప్పటివరకు 26 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అందులో నాలుగు మృతదేహాలు గుర్తించామని చెప్పారు కలెక్టర్ ప్రావీణ్య.

వీరిలో 20 మృతదేహాలు గుర్తు తెలియని స్థితిలో ఉన్నాయని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఇంకా 27 మంది (శకలాల కింద ఉండే అవకాశం లేదా వారి ఆచూకీ తెలియలేదు) అని తెలిపారు. మొత్తం 31 మృతదేహాలు పటాన్‌చెరు‌లోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో ఉన్నాయని చెప్పారు. మృతదేహాలకు పరీక్షలు కొనసాగుతున్నాయని.. బాధిత కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారుల సమక్షంలో రక్త నమూనా ఇవ్వాలని సూచించారు. ఆయా కుటుంబాలు డీఎన్ఏ పరీక్షలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155ను సంప్రదించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.

పాశమైలారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

పాశమైలారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు పఠాన్‌చెరులోని ధ్రువ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలతో సీఎం మాట్లాడనున్నారు. 10: 15 గంటలకు పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలోని పేలుడు ఘటనాస్థలిని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారు. ఇప్పటికే క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని, వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

యూఎస్‌ను హెచ్చరించిన ఇరాన్

ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ

For More Telangana News and Telugu News

Updated Date – Jul 01 , 2025 | 09:14 AM

Source link