Press "Enter" to skip to content

Maargan Movie Review: రివ్యూ: మార్గన్‌.. విజయ్‌ ఆంటోనీ సరికొత్త ప్రయోగం ఫలించిందా?

Maargan Movie Review || చిత్రం: మార్గన్‌: ది బ్లాక్‌ డెవిల్‌; నటీనటులు: విజయ్‌ ఆంటోనీ, అజయ్‌ దిషాన్‌, సముద్రఖని, మహానంది శంకర్‌, ప్రీతిక, బ్రిగడ సాగా, వినోద్‌ సాగ్‌ తదితరులు; సంగీతం: విజయ్‌ ఆంటోనీ; ఎడిటింగ్‌: లియో జాన్‌పాల్‌; సినిమాటోగ్రఫీ: యువ ఎస్‌; నిర్మాత: మీరా విజయ్‌ ఆంటోనీ; రచన, దర్శకత్వం: లియో జాన్‌ పాల్‌; విడుదల: 27-06-2025

వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రయోగాలు చేస్తుంటారు విజయ్‌ ఆంటోనీ. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. తాజాగా ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్‌ ‘మార్గన్‌: ది బ్లాక్‌ డెవిల్‌’. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? (Maargan review in telugu) ఎలాంటి థ్రిల్ పంచింది?

కథేంటంటే..

Maargan Story || హైదరాబాద్‌లో రమ్య అనే ఓ యువతి దారుణ రీతిలో హత్యకు గురవుతుంది. శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ కేసు ముంబయి అడిషనల్‌ డీజీపీ ధృవ కుమార్‌ (విజయ్‌ ఆంటోని) దృష్టికి వస్తుంది. గతంలో తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురవడంతో రమ్య కేసును వ్యక్తిగతంగా తీసుకుంటాడు. దాన్ని స్వయంగా పరిష్కరించేందుకు హైదరాబాద్‌ పోలీస్‌శాఖ సహకారంతో అనధికారికంగా టీమ్‌తో రంగంలోకి దిగుతాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి.అరవింద్‌ (అజయ్‌ దిశాన్‌) అనే కుర్రాడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అరవింద్‌.. అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి అవేంటి?నగరంలో జరుగుతున్న హత్యలకు అరవింద్‌కూ ఏమైనా సంబంధం ఉందా? ధృవ కూతుర్ని హత్య చేసింది ఎవరు? ఈ కేసును పరిష్కరించే క్రమంలో ఆయనకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది మిగిలిన కథ.

ఎలా సాగిందంటే..

Maargan review || క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలన్నీ ఒకే పంథాలో సాగుతుంటాయి. ఒకే రీతిలో జరిగే హత్యలు.. వాటి వెనుక ఓ ముసుగు వ్యక్తి ఉండటం.. అతన్ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయాణం.. ఈ క్రమంలో తన తెలివితేటలతో అసలు నేరస్థుడ్ని పట్టుకోవడం. ఈ చిత్రం ఆరంభమైన తీరు చూస్తే.. ఇది కూడా దాదాపు అదే పంథాలో సాగుతుందని అర్థమవుతుంది. టైటిల్‌ కార్డ్స్‌ పడకముందే రమ్య హత్య ఎపిసోడ్‌తో కథలో సీరియస్‌నెస్‌ ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. కథానాయకుడు ఇలా కేసు టేకప్‌ చేయగానే.. తన వద్ద ఉన్న ఆధారాలతో అరవింద్‌ను అనుమానితుడిగా గుర్తించి ఠక్కున విచారణకు తీసుకొచ్చేయడం చూస్తే ఈ కేసు ఇంత తేలికగా ఓ కొలిక్కి వచ్చేసిందా? అనే ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ, అక్కడి నుంచే కథలోని కొత్త కోణం బయటకి వస్తుంది. (Maargan Movie 2025 Review) ఇది రెగ్యులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పంథాలో సాగే కథ కాదని అర్థమవుతుంది. విచారణ క్రమంలో అరవింద్‌ పాత్రలోని అసాధారణ శక్తి సామర్థ్యాల గురించి హీరోకి అర్థమవడం.. ఈ క్రమంలో అతను తన గతాన్ని పరిచయం చేయడం కథను ఆసక్తికరంగా మారుస్తాయి. అయితే ఈ క్రమంలో బయటపడే కొన్ని అంశాలు.. అప్పటిదాకా జరిగిన హత్యలతో అరవింద్‌కు సంబంధం ఉన్నట్లు అనిపించినా.. ఇంటర్వెల్‌కు వచ్చేసరికి దీనిపై అటు హీరోకీ ఇటు ప్రేక్షకులకూ ఓ స్పష్టత వచ్చేస్తుంది. అది ద్వితీయార్ధంపై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.

విరామ ఘట్టం పంచిన థ్రిల్‌కు తగ్గట్లుగానే ద్వితీయార్ధం కూడా రసవత్తరంగానే మొదలవుతుంది. కానీ, హీరో ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ ఊపందుకున్నప్పటి నుంచి కథలో వేగం మందగిస్తుంది. ముఖ్యంగా కథకు కీలకమైన హీరో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ అంత ప్రభావవంతంగా అనిపించదు. అలాగే అతను కేసు విషయంలో సొంత తెలివితేటలపై ఆధారపడకుండా పూర్తిగా అరవింద్‌ శక్తి సామర్థ్యాల్ని నమ్ముకుని ముందుకెళ్లడం వల్ల థ్రిల్‌ పంచాల్సిన ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ వీక్‌గా మారిపోయిన అనుభూతి కలుగుతుంది. అరవింద్‌ తనకున్న అసాధారణ శక్తులతో హత్య కేసులోని కీలక విషయాల్ని బయట పెట్టే తీరు ఆరంభంలో థ్రిల్లింగ్‌గా అనిపించినా.. ఓ దశ దాటాక దర్శకుడు మరీ సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌ కాస్త సాగదీశాడేమో అనిపిస్తుంది. సైకో కిల్లర్‌ ఎవరన్నది ప్రేక్షకులకు స్పష్టత వచ్చినా.. అతను అలా చేయడానికి వెనునుకున్న కారణం ఏమంత కొత్తగా ఉండదు.

ఎవరెలా చేశారంటే…

ఈ తరహా కథలు విజయ్‌ ఆంటోనికి (Vijay Antony) కొట్టిన పిండే. ఇందులో నటుడిగా తనకు సవాల్‌ విసిరే అంశాలేమీ లేవు. పోలీస్‌ పాత్రకు తగ్గట్లు ఆద్యంతం సీరియస్‌గా ఒకే లుక్‌లో కనిపించారు. అజయ్‌ దిశాన్‌ పాత్ర కథకు కొత్తదనాన్ని అద్దింది. ఆరంభంలో సైకో కిల్లర్‌లా ప్రతినాయక ఛాయలున్న పాత్రగా కనిపించిన తను.. ద్వితీయార్ధానికి వచ్చే సరికి ఓ మినీ సూపర్‌ హీరోలా అలరించాడు. సముద్రఖని అతిథి పాత్రలా అలా మెరిసి.. ఇలా మాయమయ్యారు. విజయ్‌కి సాయపడే పోలీస్‌గా బ్రిగిడ సాగా ఆకట్టుకుంటుంది. ప్రీతిక, వినోద్‌ సాగర్, దీప్సిక తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు (Maargan Movie Director) కథను ఆరంభించిన తీరు ఆకట్టుకున్నా.. ముగించిన విధానం సంతృప్తినివ్వదు. విజయ్‌ ఆంటోని సంగీతం కథకు అదనపు బలాన్నిచ్చింది. యువ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • + అరవింద్‌ పాత్ర
  • + థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌
  • బలహీనతలు
  • ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • క్లైమాక్స్‌
  • చివరిగా: సెకండాఫ్‌ కాస్త డల్‌ అయినా.. థ్రిల్‌ పంచే ‘మార్గన్‌’!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Source link